Tuesday, January 26, 2010

ఫిర్ మిలే సుర్ మేరా తుమ్హారా

ముందు ఈ వీడియోలు చూడండి




దీపికా పదుకునే,శిల్ప సెట్టి,రణ్ భీర్ కపూర్,షాహిద్ ఎవరండీ వీళ్ళంతా.ఏంటీ వీళ్ళ గొప్పతనం? అబ్దుల్ కలాం గారు,సచిన్,sp బాలు,విశ్వనాధన్ ఆనంద్,నారాయణ మూర్తి ,టాటా,ఇళయరాజా.....ఏమయిపోయారు వీళ్ళంతా.
ఇండియా అంటే సినిమాస్టార్లు తప్పించి ఎవరూ గొప్పోళ్ళు లేనట్టున్నారు.
తాజ్ మహల్,హిమాలయాలు లేకుండా పిల్లలు కూడా ఇండియా గురించి మాట్లాడరే..మరి పెద్దలెలా మర్చిపోయారు?కాష్మీర్ ని సినిమా పెద్దలు పాకిస్తాన్ కి ఇచ్చేసినట్టున్నారు..అసలు వీడియోలో ఆత్మ ఎక్కడుంది?ఇంత హడావుడి ముగింపు ఎందుకు ఇవ్వాల్సొచ్చింది?అసలు దీన్ని రీమేక్ చేసి ఏమి చూపించాలనుకున్నారు?ఎంత ఆశగా ఎదురుచూసానో వీడియో గురించి.హుమ్మ్

ఒక సారి ఈ పాత వీడియో చూడండి.నా బాధ మీకూ అర్ధం అవుతుంది.

Thursday, April 17, 2008

శ్రీలంకలో రామాయణం

http://www.megavideo.com/?v=CLT5Z7ET

Saturday, March 08, 2008

తెల్ల కాగితం

సొంత ఇంట్లోకి మారడానికి సామాను సర్ధుతూవుంటే పాత సూట్కేస్ లో కనిపించింది "తెల్ల కాగితం".తెలుగు మాష్టారు చెప్పిన మాటలు చాలా రోజుల తరువాత, కాదు కాదు చాలా ఏళ్ల తరువాత గుర్తొచ్చాయి.అలాగే దానినే తదేకం గా చూస్తూవుంటే రాధ అడిగింది ఏమిటి విషయమని.ఆ ప్రశ్న నన్ను మా ఊరికి,నా బాల్యానికి తీసుకుపోయింది.
ఆరో తరగతిలో హనుమంతరామయ్య మాష్టారు ఒక తెల్లటికాగితాన్ని చూపిస్తూ చెప్పారు"మనిషి తెల్లకాగితం లాంటివాడు.జీవితం లో జరిగే ఒక్కో సంఘటనా దాని మీద రాసే అక్షరంలాంటిది.జీవితం చివరి దశలో చూసుకుంటే ఆ కాగితం లో అందమయిన వరుసలతో అనుభవాల కావ్యం వుండాలి.అంటే తప్పులు చెయ్యడం,తప్పుదారిలో వెళ్ళడం చేయకూడదు.కాగితం మీద తప్పులు రాస్తే ఎలా చెరిపేయలేమో అలాగే జీవితం లో చేసిన తప్పులను కూడా తుడిచేయలేము.కొట్టివేతలు , దిద్దివేతలు తెల్లకాగితాన్ని ఎంత అందవిహీనం గా మారుస్తాయో అలాగే మనం చేసిన తప్పులు మన జీవితం లో అలా అందవిహీనం గా వుండిపోతాయి.తెల్లకాగితాన్ని ఆదర్శం గా తీసుకుని అలా స్వచ్చం గా బ్రతకాలి అనుకోండి" అని మా పసిమనసుల్లో నాటుకొనేలా ఎంత బాగా చెప్పారు.మా యజమానిగారి గుమాస్తా ఇచ్చే పసుపచ్చని పాత రూళ్ళపుస్తకాలనే చూసిన నాకు అంత తెల్లని కాగితం ఎంత నచ్చిందో.ఆయన ఇంకా చెపుతూ వుండగానే ఆఖరు బెల్లు కొట్టేసారు.పిల్లలు,మాష్టారు ఇంటికెళ్ళే తొందరలో వున్నారు.నా మనసు మాత్రం ఆ కాగితం మీదే వుంది.అలాంటి కాగితం నాదగ్గర వుంటే ఎంత బాగుండునని ఆలోచిస్తూవున్న నాకు ఒక్కసారి కళ్ళు మెరిసాయి.మాష్టారు కాగితాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నారు.అప్పటికే పిల్లలందరూ వెళ్ళిపోయారు.ఇక అది నాదే అంటే నమ్మబుద్దికావట్లేదు.ఆయన గుమ్మం దాటగానే ఒక్కపరుగులో వెళ్ళి కాగితాన్ని అందుకున్నాను.అది నాసొంతం అని అనుకోగానే ప్రపంచాన్ని జయించినంత ఆనందం.కాని మరుక్షణం లోనే తెలివి వచ్చింది.మాష్టారి కాగితం ఆయన అనుమతిలేకుండా తీసుకోకూడదని అనుకుని దానిని పట్టుకుని వెంటనే మాష్టారి దగ్గరకి పరుగుపెట్టి మర్చిపోయారని చెప్పి ఆయనకి ఇవ్వబోతే నవ్వి వుంచుకోరా అన్నారు.అప్పుడు తెలిసింది నిజాయితీగా వుంటే కావల్సింది వస్తుందని.అలాగే ఆ కాగితాన్ని అపురూపం గా పట్టుకుని ఇంటికి వెళ్ళాను.ఈ కాగితాన్ని ఏమి చెయ్యాలి,ఏమి రాయాలి అని ఆలోచనలతోనే ఆ రాత్రంతా గడిచిపోయింది.పొద్దట లేచాకా కూడా ఎన్నో ఆలోచనలు.కానీ ప్రతీదీ ఆ కాగితం మీద రాయడానికి అర్హత లేనిదిగానే అనిపిస్తుంది.అపురూపమయింది దొరికితే ఇలాగే వుంటుందేమో?చివరికి నిశ్చయించుకున్నాను ఏమీ రాయకుండా ఆ తెల్లని కాగితాన్ని ప్రేరణగా అలానే వుంచాలని.అప్పటినుండి ఆ కాగితాన్ని చాలా జాగ్రత్తగా దాస్తూవచ్చాను.డిగ్రీ లో జాయిన్ అయ్యేటప్పుడనుకుంటాను వేరే ఊరిలో ఉండి చదవాల్సి వచ్చింది.ఇక ఆ కాగితాన్ని భద్రం గా ఫైలులో దాచి ఇంట్లో వుంచేసాను.దానిని కళ్ళనుండి దూరం గా వుంచినా చాలాకాలం ఆయన మాటలు మదిలో మెదులుతూ వుండేవి.అలా తెల్ల కాగితం లా బ్రతకాలని దృఢ నిశ్చయం తో, బ్రతుకుపై ఆశలతో కొత్త లోకం లోకి అడుగుపెట్టాను.కొత్త స్నేహాలు,కొత్త రుచులు,కొత్త దారులు ఆ కాగితాన్ని నా జ్ఞాపకాలనుండి కూడా దూరం చేసేసాయి.మళ్ళా ఇన్నాళ్లకి ఇలా పాత జ్ఞాపకాలను కలుస్తాననుకోలేదు.చెప్పడం పూర్తిచేసి నిట్టుర్చిన నా భుజం పై చేయివేసి తట్టింది రాధ.అంతా నిశ్శబ్ధం గా వుంది. తరువాత కాలం లో చాలా తెల్ల కాగితాలు చూసాను.కానీ ఏనాడూ ఏ భావనా కలగలేదు ఎందుకో?కానీ కాలం ప్రభావంతో పసుపు గా మారిన ఈ తెల్ల కాగితం మాత్రం నాకేదో చెపుతుంది.ఎన్నో భావాలు నిద్రలేపుతుంది.
రంగు మారినా మచ్చలేని ఆ కాగితం మళ్ళా నాకేదో నేర్పింది.తృప్తిగా దానిని గుండెలకు హత్తుకున్నాను.

కొత్త ఇంట్లో ,ఖరీదయిన ఫ్రేములో నా కళ్ళెదురుగా నా ప్రేరణ.

ఈ కధ పోటీ కోసం కాదుగానీ ఏదో నా సరదా కోసం.నేనూ రాసానని ఒక ఆత్మ అసంతృప్తి కోసం.

Tuesday, March 20, 2007

మరో వెన్నెల గీతం

ఈ పాట "మొదటి సినిమా" అన్న చిత్రం లోనిది.సిరివెన్నెల గారి మరో ఆశా ప్రబోధ గీతం.టైటిల్స్ వస్తున్నప్పుడు ఈ పాట వస్తుంది.వెనుకగా రాజు సుందరం మరియూ గ్రూపు డాన్సు చాలా బాగుంటుంది.పాట ట్యూను ఇంకా బాగుంటుంది.ఈ సినిమా చూస్తున్నప్పటికి ఈ పాట రాసింది సిరివెన్నెలవారని నాకు తెలీదు.వింటూవుంటే నాకు అనిపిచింది ఆయనే రాసారేమో అని.నాకు బాగా నచ్చిన పాటలని సిరివెన్నెల గారు రాసుంటే బాగుండుని అనేసుకుంటాను.అలాగే ఈ పాటని కూడా ఆయన రాసుంటే బాగుండును అనుకున్నాను అదే నిజం అయింది.

నిన్నయినా నేడయినా..రోజన్నది ఎపుడయినా
ఒకలాగే మొదలయినా..ఒకలాగే పూర్తయినా
ఏపూటకి ఆ పూటే బ్రతుకంతాసరికొత్తే
ఆ వింతను గమనించే వీలున్నది కాబట్టే
మన సొంతం కాదా ఏ క్షణమయినా

ఎటునీ పయనమంటే-నిలిచేదెక్కడంటే
మనలా బదులుపలికే శక్తి ఇంక ఏ జీవికి లేదే
యదలో ఆశ వెంటే ఎగసే వేగముంటే
సమయం వెనకబడదా ఊహ తనకన్న ముందుంటె
మన చేతుల్లో ఏముందీ అనే నిజం నిజమేనా
మనకే ఎందుకు పుట్టిందీ ఈ లేనిపోని ప్రశ్న
మనసుకున్న విలువ మరిచిపోతే శాపం కాదా ఏ వరమయినా

కసిరే వేసవయినా ముసిరే వర్షమయినా
గొడుగే వేసుకుంటే వద్దని అడ్డం పడుతుందా
మసకే కమ్ముకున్నా ముసుగే కప్పుకున్నా
కనులే కలలుగంటే నిద్దురే కాదని అంటుందా
నిట్టూరుపు తరిమేస్తుంటే పారిపోదా సంతోషం
ఆయువే ఇంకా మిగిలుంటే మానిపోదా ప్రతిగాయం
నమ్మకాన్ని వదులుకున్న మనిషికి విషమవదా అమ్రుతమయినా

Labels:

Monday, March 12, 2007

ఇది చూసారా?

Friday, February 23, 2007

మా ఊరు-నా బాల్యం

"గోదారమ్మకు గట్టయి మురిసే ఊరేమాది..
భూదేవమ్మకు బొట్టయి మెరిసింది"



అనగనగా మా ఊరు.ఒక అక్క,ఒక తమ్ముడు,ఒక నేను.పక్కిళ్ళల్లో చౌదరి,పుర్ణ,నాని,ఝాన్సి,దొర,గోపన్నయ్య,తులసి....ఇన్ని పేరులు చదవడానికి మీకు అలుపొస్తున్నా..ఆడుకోవడానికి మాకు అలుపుండేది కాదు.ఇంచుమించు అందరిదీ ఒకే వయసు సంవత్సరం అటూ ఇటూగా.అందరం ఒకే స్కూలు.కలిసి వెళ్ళి కలసి వచ్చేవాళ్ళం.అందరం ఒకే రిక్షాలో సరిపోయేవాళ్ళం.ఇళ్ళకి వచ్చి పుస్తకాల సంచిని మూలకి గిరాటేసి ఆడుకోడానికి పరుగో పరుగు.ఇక చాలు రమ్మని పిలిచి పిలిచి పెద్దాళ్ళు విసిగిపోయి ఒక్కొక్కళ్ళకి ఒక్కోటి తగిలించి లాక్కుపోయేవారు.ఆ తరువాత స్నానాలు గావించి ఈసురో దేవుడా అంటూ హోంవర్కులు మొదలు పెట్టేవాళ్ళం.ఎవరో ఒక వాకిట్లో అందరు కలిసి కూర్చుని ఒకళ్ళ చేతి రాతని ఇంకొకళ్ళు వెక్కిరించుకుంటూ నేను ఫస్ట్ అంటే నేను ఫాస్ట్ అంటూ పోటీ గా పూర్తిచేసేవాళ్ళం.అందరిలోకి మా అక్క పెద్దది.లెక్కల్లో దిట్ట.మా అందరికీ లెక్కలంటే చచ్చే అంత భయం. పాపం అందరికీ ఓపికగా చెపుతూ వుందేది.అప్పట్లోనే మా ఉరిలో కరంటు కోత వుండేది. చిమ్ని దీపాలు వెలిగించుకుని పీటల మీదపెట్టి చదివేవాళ్ళం.పెద్ద వాకిట్లో అంత మంది పిల్లలు ఒక్కక్కళ్ళదగ్గర ఒక్కో దీపం ...అలా వాకిలి చూడడానికి కార్తీక మాసం లో కోనేరులా వుండేది.మేము చదువుల పని ముగించుకొనే సరికి అమ్మలందరూ కంచాల్లో భోజనాలు పట్టుకుని సిద్దం గా వుండేవారు.అలా వాకిట్లోనో,వీధి అరుగు మీదో కలిసే కబుర్లతో నిండుగా తినేవాళ్ళం.భోజనాల తరువాత అరుగుల మీద చాపలు పరిచి ఆడవాళ్ళంతా ఒక అరుగుమీద,మగవాళ్ళు ఇంకో అరుగు,పిల్లకాయలు మరో అరుగుమీద కుర్చుని, పిల్ల గాలిని ఆస్వాదిస్తూ గడిపేసేవాళ్ళం.దోమల కాలంలో అయితె రక్తదానాలు చేస్తూ,దోమలను హత్యలు చేస్తూ కొన్ని సార్లు అక్కడే నిద్దరోయేవాళ్ళం.ఇక ఎండాకాలం సెలవులు ఎలా గడిచేవో తెలిసేది కాదు.మాది పక్కా పల్లెటూరు కదా..కాబట్టి అందరూ అమ్మమ్మ ఊరని,మావయ్య వూరని ఇక్కడికేవస్తూవుండేవారు.మేము వెళ్ళింది చాలా తక్కువ.ప్రతీ పండక్కి,సెలవులకి ఇళ్ళన్ని చుట్టాలతో సందడి గా వుండేవి.మా వీధికి మా ఇళ్ళే ఆఖరు.మా పక్కన అన్నీ పొలాలు,కాలువ.ఇంటిపక్కనే చిన్న తోట వుండేది మాది.అందులో మామిడి చెట్లు,జామ,నిమ్మ,కుంకుడు చెట్టు,వేప చెట్టు,కొబ్బరి చెట్లు..ఇలా కొన్ని రకాల చెట్లు వుండి తరువాత పొలాలు వుండేవి.ఆ తోటలోనే బోరింగ్ పంప్ కూడా వుండేది.మగ పిల్లలంతా గోచీలు పెట్టుకుని అందులో స్నానాలతో గడిపేసేవారు.
ఇంకా కోతికొమ్మచ్చి,జోరీబాల్ ఆటలు ఆడేవారు.అమ్మాయిలమేమో బుజ్జిబువ్వాలాట,వామనగుంటలు,అష్టాచెమ్మ..ఇలాంటి ఆటలు ఆడేవాళ్ళం.ఇవికాక అందరూ పొలాలగట్లు వెంటపడి మామిడి కాయలు,చింతకాయలు,సీమ చింతకాయలు,ఉసిరికాయలు ఏరుకోవడం,దొరకకపోతే దొంగతనం గా పంగలకర్రలలో రాళ్ళుపెట్టి కాయలు రాలగొట్టడం చేస్తూవుండేవాళ్ళం.ఈ పంగల కర్రల కోసం మంచి జంట కొమ్మలను వెతికి పట్టడం అసలు పెద్ద పని.సాయంత్రాలు గాలిపటాలు ఎగరేయడాలు ఎలాగూ వుండేవి.అప్పట్లో ఎండలు మరీ ఇంత తీవ్రం గా వుండేవి కాదు కాబట్టి బయటకెళ్ళి ఆడుకోవడానికి అనుమతి వుండేది.ఇప్పుడయితే ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్.వానాకాలం లో కాగితం పడవల సరదాలు,నీటి గుంటల్లో ఎగిరిదూకి మురికయిన బట్టల్లో వచ్చి ఇంట్లో దెబ్బలు తినడాలు అస్సలు మరిచిపోలేను.అప్పట్లో టీవీ లో శుక్రవారం చిత్రలహరి,ఆదివారం సినిమా అస్సలు మిస్ అవ్వకుండా చూసేవాళ్ళం.ఒక్కళ్ళ ఇంట్లోనే టీవీ వుండేది.ఆ రెండు రోజులూ టీవీని వాకిట్లో పెట్టేసేవాళ్ళు.ఆ సమయానికి ఆ వాకిలి చిన్న సైజు సినిమా హాలు లా వుండేది.ఇది కాకుండా నవరాత్రులకి వీధిలో వేసే తెర సినిమాకి పీటలు,చాపల్తో వెళ్ళిపోవడం,శ్రీరామ నవమి కి గుళ్ళో ఇచ్చే విసినకర్రలు,పానకం,ఐస్ ఫ్రూట్ లకోసం ఎగబడడం,సంక్రాంతికి ముగ్గుల సరదాలు...ఎన్నని గుర్తుచేసుకోను?ఇవన్ని తలచుకుంటుంటే ఎంత హాయిగా అనిపిస్తుందో.అపార్టుమెంటు కల్చర్,టీవీలు మనుషుల జీవితాలను ఇరుకుగా చేసేసాయనిపిస్తూవుంటుంది.అసలు టీవీ ఊసే లేకుండా,బోరనేదే తెలీకుండా అంత బిజీ గా ఎలా వుండే వాళ్ళమో .....అది తలచుకుంటే నాకే ఆశ్చర్యమేస్తుంది.ఏదేమయినా ఆ ఆనందం,సంతోషం,ఆ స్వేచ్చ,ప్రక్రుతిలో లీనమయి బ్రతకడం ఇప్పటి వాళ్ళకి కుదరదేమో?
"జన్మా జన్మా ఈ ఊళ్ళోనే గడపాలి...చల్లని నల్లని రేగడి నేలలో కలవాలి"

Labels:

Wednesday, February 21, 2007

Tajmahal