తెల్ల కాగితం
సొంత ఇంట్లోకి మారడానికి సామాను సర్ధుతూవుంటే పాత సూట్కేస్ లో కనిపించింది "తెల్ల కాగితం".తెలుగు మాష్టారు చెప్పిన మాటలు చాలా రోజుల తరువాత, కాదు కాదు చాలా ఏళ్ల తరువాత గుర్తొచ్చాయి.అలాగే దానినే తదేకం గా చూస్తూవుంటే రాధ అడిగింది ఏమిటి విషయమని.ఆ ప్రశ్న నన్ను మా ఊరికి,నా బాల్యానికి తీసుకుపోయింది.
ఆరో తరగతిలో హనుమంతరామయ్య మాష్టారు ఒక తెల్లటికాగితాన్ని చూపిస్తూ చెప్పారు"మనిషి తెల్లకాగితం లాంటివాడు.జీవితం లో జరిగే ఒక్కో సంఘటనా దాని మీద రాసే అక్షరంలాంటిది.జీవితం చివరి దశలో చూసుకుంటే ఆ కాగితం లో అందమయిన వరుసలతో అనుభవాల కావ్యం వుండాలి.అంటే తప్పులు చెయ్యడం,తప్పుదారిలో వెళ్ళడం చేయకూడదు.కాగితం మీద తప్పులు రాస్తే ఎలా చెరిపేయలేమో అలాగే జీవితం లో చేసిన తప్పులను కూడా తుడిచేయలేము.కొట్టివేతలు , దిద్దివేతలు తెల్లకాగితాన్ని ఎంత అందవిహీనం గా మారుస్తాయో అలాగే మనం చేసిన తప్పులు మన జీవితం లో అలా అందవిహీనం గా వుండిపోతాయి.తెల్లకాగితాన్ని ఆదర్శం గా తీసుకుని అలా స్వచ్చం గా బ్రతకాలి అనుకోండి" అని మా పసిమనసుల్లో నాటుకొనేలా ఎంత బాగా చెప్పారు.మా యజమానిగారి గుమాస్తా ఇచ్చే పసుపచ్చని పాత రూళ్ళపుస్తకాలనే చూసిన నాకు అంత తెల్లని కాగితం ఎంత నచ్చిందో.ఆయన ఇంకా చెపుతూ వుండగానే ఆఖరు బెల్లు కొట్టేసారు.పిల్లలు,మాష్టారు ఇంటికెళ్ళే తొందరలో వున్నారు.నా మనసు మాత్రం ఆ కాగితం మీదే వుంది.అలాంటి కాగితం నాదగ్గర వుంటే ఎంత బాగుండునని ఆలోచిస్తూవున్న నాకు ఒక్కసారి కళ్ళు మెరిసాయి.మాష్టారు కాగితాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నారు.అప్పటికే పిల్లలందరూ వెళ్ళిపోయారు.ఇక అది నాదే అంటే నమ్మబుద్దికావట్లేదు.ఆయన గుమ్మం దాటగానే ఒక్కపరుగులో వెళ్ళి కాగితాన్ని అందుకున్నాను.అది నాసొంతం అని అనుకోగానే ప్రపంచాన్ని జయించినంత ఆనందం.కాని మరుక్షణం లోనే తెలివి వచ్చింది.మాష్టారి కాగితం ఆయన అనుమతిలేకుండా తీసుకోకూడదని అనుకుని దానిని పట్టుకుని వెంటనే మాష్టారి దగ్గరకి పరుగుపెట్టి మర్చిపోయారని చెప్పి ఆయనకి ఇవ్వబోతే నవ్వి వుంచుకోరా అన్నారు.అప్పుడు తెలిసింది నిజాయితీగా వుంటే కావల్సింది వస్తుందని.అలాగే ఆ కాగితాన్ని అపురూపం గా పట్టుకుని ఇంటికి వెళ్ళాను.ఈ కాగితాన్ని ఏమి చెయ్యాలి,ఏమి రాయాలి అని ఆలోచనలతోనే ఆ రాత్రంతా గడిచిపోయింది.పొద్దట లేచాకా కూడా ఎన్నో ఆలోచనలు.కానీ ప్రతీదీ ఆ కాగితం మీద రాయడానికి అర్హత లేనిదిగానే అనిపిస్తుంది.అపురూపమయింది దొరికితే ఇలాగే వుంటుందేమో?చివరికి నిశ్చయించుకున్నాను ఏమీ రాయకుండా ఆ తెల్లని కాగితాన్ని ప్రేరణగా అలానే వుంచాలని.అప్పటినుండి ఆ కాగితాన్ని చాలా జాగ్రత్తగా దాస్తూవచ్చాను.డిగ్రీ లో జాయిన్ అయ్యేటప్పుడనుకుంటాను వేరే ఊరిలో ఉండి చదవాల్సి వచ్చింది.ఇక ఆ కాగితాన్ని భద్రం గా ఫైలులో దాచి ఇంట్లో వుంచేసాను.దానిని కళ్ళనుండి దూరం గా వుంచినా చాలాకాలం ఆయన మాటలు మదిలో మెదులుతూ వుండేవి.అలా తెల్ల కాగితం లా బ్రతకాలని దృఢ నిశ్చయం తో, బ్రతుకుపై ఆశలతో కొత్త లోకం లోకి అడుగుపెట్టాను.కొత్త స్నేహాలు,కొత్త రుచులు,కొత్త దారులు ఆ కాగితాన్ని నా జ్ఞాపకాలనుండి కూడా దూరం చేసేసాయి.మళ్ళా ఇన్నాళ్లకి ఇలా పాత జ్ఞాపకాలను కలుస్తాననుకోలేదు.చెప్పడం పూర్తిచేసి నిట్టుర్చిన నా భుజం పై చేయివేసి తట్టింది రాధ.అంతా నిశ్శబ్ధం గా వుంది. తరువాత కాలం లో చాలా తెల్ల కాగితాలు చూసాను.కానీ ఏనాడూ ఏ భావనా కలగలేదు ఎందుకో?కానీ కాలం ప్రభావంతో పసుపు గా మారిన ఈ తెల్ల కాగితం మాత్రం నాకేదో చెపుతుంది.ఎన్నో భావాలు నిద్రలేపుతుంది.
రంగు మారినా మచ్చలేని ఆ కాగితం మళ్ళా నాకేదో నేర్పింది.తృప్తిగా దానిని గుండెలకు హత్తుకున్నాను.
కొత్త ఇంట్లో ,ఖరీదయిన ఫ్రేములో నా కళ్ళెదురుగా నా ప్రేరణ.
ఈ కధ పోటీ కోసం కాదుగానీ ఏదో నా సరదా కోసం.నేనూ రాసానని ఒక ఆత్మ అసంతృప్తి కోసం.
14 Comments:
This comment has been removed by the author.
చాలా చాలా బాగుంది రాధిక గారు మీ తెల్ల కాగితం కధ. మీ మీదా , మీ కధ మీద కల నా నమ్మకాన్ని మీరు వమ్ము చేయలేదు. మీ కవితలాగే , మీ కధ కూడా మనసు అంచులని దాటింది. మీరింకా ఇలా మంచి మంచి కధలని అందిస్తారని ఆశిస్తూ... gr8.
దీన్ని ఇంకా బాగా ఎలా వ్రాయవచ్చోఆలోచించండి! పాఠం మొత్తం ఒకే పారగ్రాఫ్ లాగా ఉంది. చదువుకోవడానికి ఇబ్బంది గా కూడా ఉంది.
ఆలోచన బాగుంది!
Good job!
Thanks for joining in!
మంచి వారే. కథని ప్రచురించాను అని నాకు చెప్పకపోతే ఎలా తెలుస్తుందీ? పాల్గొంటున్న వారు నాకో మెయిలు కొట్టండీ అని మెయిలు ఎడ్రసుకూడా ఆ టపాలోనే పెట్టాను కదా!
పోన్లెండి, లలిత గారి పుణ్యమా అని .. ఆమె తన కథ కింద ఇచ్చిన లింకుల్లో చూసి వచ్చాను.
తెల్లకాగితానికి కొత్త అర్ధం ఇచ్చారు కథలో అభినందనలు.
బాగా రాసారు ఒక్క తెల్ల కాగితం వెనక ఇన్ని రకాల కథలు చదువుతున్నాం భలే బావుంది.
మీరు కాగితంతో కూడా మదిని మీటవచ్చని ౠజువుచేసారు.
చక్కటి, ఆహ్లాదకరమైన కవితలు రాయడంలో మీరు టాపర్. ఏదో రాయాలి గనుక మొక్కుబడిగా రాసారీ కథ. నిజంగా మీరు రాయదలిస్తే చాలా బాగా రాయగలరని నేననుకుంటా.
ఇంత అందమైన దాన్ని అర్ధాంతరం గా ఆపేసారేంటండీ ?
ఇంకా పొడిగిచ్చి ఉంటే ఈ కథ చాలా బాగుండేది కదా
పాత్ర ఎలా తెల్ల కాగితం లా ఉండాడానికి ప్రయత్నించిందో....కొన్ని సంఘటనలతో చెప్పి,ఆఖరికి ఎవరికన్నా వారసత్వం గా ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది కదా
రాయగలిగిన వారు కూడా రాయక పోతే ఎలాగండీ
మీరు ఏ కధాంశం కైనా కధను కానీ, కవితను కానీ రాయగలరు.అది ఖచ్చితంగా బాగుంటుంది. కొద్ది మార్పులు తప్పితే, మీరు జీవితాన్ని చక్కగా అన్వయి స్తారు.బాగుంది అని మాత్రమే అంటే బాగుండనంత బాగారాస్తారు మీరు.
మీ కవితల్లాగే ఉంది మీ కథ చదువుతుంటే! కాకపొతే కవిత కంటే బాగా సులభంగా ఉంది.
మీరు ఈ బ్లాగ్ లో కూడా రాస్తున్నారని తెలియదు.
అలా అలా... ఎలాగెలాగో ఇక్కడికి వచ్చాను. ఈ blog కూడా bookmark చేసుకోవాల్సివచ్చింది.
మా Teacher గారి కలం పేరు మీద ఒక బ్లాగు (సురపాల (http://surapaala.blogspot.com/)) మొదలెట్టాను. మీకు టైమ్ ఉన్నప్పుడు ఓ లుక్కు వేయండి.
తెల్లకాగితం.. ఊరించే పదం 2 dimentional word with a wepth..in it.
nice blog
www.youtube.com/channel/UCJMx6_3I6oTEC858UVMuyzg/videos
plz watch our channel
Post a Comment
<< Home