Friday, February 23, 2007

మా ఊరు-నా బాల్యం

"గోదారమ్మకు గట్టయి మురిసే ఊరేమాది..
భూదేవమ్మకు బొట్టయి మెరిసింది"



అనగనగా మా ఊరు.ఒక అక్క,ఒక తమ్ముడు,ఒక నేను.పక్కిళ్ళల్లో చౌదరి,పుర్ణ,నాని,ఝాన్సి,దొర,గోపన్నయ్య,తులసి....ఇన్ని పేరులు చదవడానికి మీకు అలుపొస్తున్నా..ఆడుకోవడానికి మాకు అలుపుండేది కాదు.ఇంచుమించు అందరిదీ ఒకే వయసు సంవత్సరం అటూ ఇటూగా.అందరం ఒకే స్కూలు.కలిసి వెళ్ళి కలసి వచ్చేవాళ్ళం.అందరం ఒకే రిక్షాలో సరిపోయేవాళ్ళం.ఇళ్ళకి వచ్చి పుస్తకాల సంచిని మూలకి గిరాటేసి ఆడుకోడానికి పరుగో పరుగు.ఇక చాలు రమ్మని పిలిచి పిలిచి పెద్దాళ్ళు విసిగిపోయి ఒక్కొక్కళ్ళకి ఒక్కోటి తగిలించి లాక్కుపోయేవారు.ఆ తరువాత స్నానాలు గావించి ఈసురో దేవుడా అంటూ హోంవర్కులు మొదలు పెట్టేవాళ్ళం.ఎవరో ఒక వాకిట్లో అందరు కలిసి కూర్చుని ఒకళ్ళ చేతి రాతని ఇంకొకళ్ళు వెక్కిరించుకుంటూ నేను ఫస్ట్ అంటే నేను ఫాస్ట్ అంటూ పోటీ గా పూర్తిచేసేవాళ్ళం.అందరిలోకి మా అక్క పెద్దది.లెక్కల్లో దిట్ట.మా అందరికీ లెక్కలంటే చచ్చే అంత భయం. పాపం అందరికీ ఓపికగా చెపుతూ వుందేది.అప్పట్లోనే మా ఉరిలో కరంటు కోత వుండేది. చిమ్ని దీపాలు వెలిగించుకుని పీటల మీదపెట్టి చదివేవాళ్ళం.పెద్ద వాకిట్లో అంత మంది పిల్లలు ఒక్కక్కళ్ళదగ్గర ఒక్కో దీపం ...అలా వాకిలి చూడడానికి కార్తీక మాసం లో కోనేరులా వుండేది.మేము చదువుల పని ముగించుకొనే సరికి అమ్మలందరూ కంచాల్లో భోజనాలు పట్టుకుని సిద్దం గా వుండేవారు.అలా వాకిట్లోనో,వీధి అరుగు మీదో కలిసే కబుర్లతో నిండుగా తినేవాళ్ళం.భోజనాల తరువాత అరుగుల మీద చాపలు పరిచి ఆడవాళ్ళంతా ఒక అరుగుమీద,మగవాళ్ళు ఇంకో అరుగు,పిల్లకాయలు మరో అరుగుమీద కుర్చుని, పిల్ల గాలిని ఆస్వాదిస్తూ గడిపేసేవాళ్ళం.దోమల కాలంలో అయితె రక్తదానాలు చేస్తూ,దోమలను హత్యలు చేస్తూ కొన్ని సార్లు అక్కడే నిద్దరోయేవాళ్ళం.ఇక ఎండాకాలం సెలవులు ఎలా గడిచేవో తెలిసేది కాదు.మాది పక్కా పల్లెటూరు కదా..కాబట్టి అందరూ అమ్మమ్మ ఊరని,మావయ్య వూరని ఇక్కడికేవస్తూవుండేవారు.మేము వెళ్ళింది చాలా తక్కువ.ప్రతీ పండక్కి,సెలవులకి ఇళ్ళన్ని చుట్టాలతో సందడి గా వుండేవి.మా వీధికి మా ఇళ్ళే ఆఖరు.మా పక్కన అన్నీ పొలాలు,కాలువ.ఇంటిపక్కనే చిన్న తోట వుండేది మాది.అందులో మామిడి చెట్లు,జామ,నిమ్మ,కుంకుడు చెట్టు,వేప చెట్టు,కొబ్బరి చెట్లు..ఇలా కొన్ని రకాల చెట్లు వుండి తరువాత పొలాలు వుండేవి.ఆ తోటలోనే బోరింగ్ పంప్ కూడా వుండేది.మగ పిల్లలంతా గోచీలు పెట్టుకుని అందులో స్నానాలతో గడిపేసేవారు.
ఇంకా కోతికొమ్మచ్చి,జోరీబాల్ ఆటలు ఆడేవారు.అమ్మాయిలమేమో బుజ్జిబువ్వాలాట,వామనగుంటలు,అష్టాచెమ్మ..ఇలాంటి ఆటలు ఆడేవాళ్ళం.ఇవికాక అందరూ పొలాలగట్లు వెంటపడి మామిడి కాయలు,చింతకాయలు,సీమ చింతకాయలు,ఉసిరికాయలు ఏరుకోవడం,దొరకకపోతే దొంగతనం గా పంగలకర్రలలో రాళ్ళుపెట్టి కాయలు రాలగొట్టడం చేస్తూవుండేవాళ్ళం.ఈ పంగల కర్రల కోసం మంచి జంట కొమ్మలను వెతికి పట్టడం అసలు పెద్ద పని.సాయంత్రాలు గాలిపటాలు ఎగరేయడాలు ఎలాగూ వుండేవి.అప్పట్లో ఎండలు మరీ ఇంత తీవ్రం గా వుండేవి కాదు కాబట్టి బయటకెళ్ళి ఆడుకోవడానికి అనుమతి వుండేది.ఇప్పుడయితే ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్.వానాకాలం లో కాగితం పడవల సరదాలు,నీటి గుంటల్లో ఎగిరిదూకి మురికయిన బట్టల్లో వచ్చి ఇంట్లో దెబ్బలు తినడాలు అస్సలు మరిచిపోలేను.అప్పట్లో టీవీ లో శుక్రవారం చిత్రలహరి,ఆదివారం సినిమా అస్సలు మిస్ అవ్వకుండా చూసేవాళ్ళం.ఒక్కళ్ళ ఇంట్లోనే టీవీ వుండేది.ఆ రెండు రోజులూ టీవీని వాకిట్లో పెట్టేసేవాళ్ళు.ఆ సమయానికి ఆ వాకిలి చిన్న సైజు సినిమా హాలు లా వుండేది.ఇది కాకుండా నవరాత్రులకి వీధిలో వేసే తెర సినిమాకి పీటలు,చాపల్తో వెళ్ళిపోవడం,శ్రీరామ నవమి కి గుళ్ళో ఇచ్చే విసినకర్రలు,పానకం,ఐస్ ఫ్రూట్ లకోసం ఎగబడడం,సంక్రాంతికి ముగ్గుల సరదాలు...ఎన్నని గుర్తుచేసుకోను?ఇవన్ని తలచుకుంటుంటే ఎంత హాయిగా అనిపిస్తుందో.అపార్టుమెంటు కల్చర్,టీవీలు మనుషుల జీవితాలను ఇరుకుగా చేసేసాయనిపిస్తూవుంటుంది.అసలు టీవీ ఊసే లేకుండా,బోరనేదే తెలీకుండా అంత బిజీ గా ఎలా వుండే వాళ్ళమో .....అది తలచుకుంటే నాకే ఆశ్చర్యమేస్తుంది.ఏదేమయినా ఆ ఆనందం,సంతోషం,ఆ స్వేచ్చ,ప్రక్రుతిలో లీనమయి బ్రతకడం ఇప్పటి వాళ్ళకి కుదరదేమో?
"జన్మా జన్మా ఈ ఊళ్ళోనే గడపాలి...చల్లని నల్లని రేగడి నేలలో కలవాలి"

Labels:

5 Comments:

At 12:13 PM, Anonymous Anonymous said...

నాకు చాల కుళ్ళుగ నున్నది.
నేను కూడా ఇలా గడిపేశా కానీ. ఇప్పుడు అవన్నీ చదువుతూ వుంటే అంతటి ఆనందం మళ్ళీ జన్మలో రాదనిపిస్తోంది.


విహారి.

 
At 10:06 PM, Blogger Rama Deepthi Muddu said...

kallaku kattinattu rasaru....
inta manchi telugu chadivi chala kalam ayyindi... mee profile chadivanu... maha prastanam chala bavuntundi ani maa ammagaru cheptu untaru... chance vasthe chadavalani undi... chala bavunnayi mee sangatulu...

 
At 7:28 AM, Blogger Unknown said...

wow ! enta baagundO. malli inkosaaru baalyaaniki teesukellaaru. chakkani raatalu. keep posting!
:)

 
At 5:57 AM, Blogger Kommireddi Pavan said...

ఇదంతా చదువుతుంటే నా బాల్యం నాకు గుర్తొచింది...చిన్నప్పుడు నెనేసిన కోతి వేషాలన్నీ కళ్ళ ముందు గిరగిర మంటూ రీవైండ్ సీనులు తిరిగాయి..చాలా బాగా రాసారు,మీ భాష చక్కగా ఉంది, కాని ఒకటే ప్రోబ్లం..నెను పల్లెటూర్లో పుట్టలేదని చాలా కుల్లుగా ఉంది..అంటే నేను పుట్టింది metropolitan or cosmopolitan cities లో కాకపొయినా..townల లో పల్లెటూరి నిర్మలత్వం దొరకదు కదా...ఇంతకీ మీదేవూరు ?

 
At 12:50 AM, Blogger విహారి(KBL) said...

Nijamgaa adbutam.
meeru cheppina chaala sangatanalu naa jeevitam lo kuuda vunnayandi.

 

Post a Comment

<< Home